manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 8:10 am Posted by : Mana Praja Prathinidhi

ఆగస్టు 25న ఉద్యోగ మేళా

మెడ్ ప్లస్‌లో 100 పోస్టుల భర్తీ
ఫార్మసిస్ట్‌, అసిస్టెంట్‌ పోస్టులకు అవకాశం
ఉస్మానియా యూనివర్సిటీలో ఇంటర్వ్యూలు
హైదరాబాద్,ఆగస్టు20(మనప్రజాప్రతినిధి):
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ప్రకటించింది. మెడ్ ప్లస్ గ్రూప్ సహకారంతో నిర్వహించే ఈ ఉద్యోగ మేళాలో ఫార్మసిస్ట్‌, అసిస్టెంట్‌ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఆగస్టు 25న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మొత్తం 100 ఖాళీలను ఈ ఉద్యోగ మేళా ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన యువతకు కూడా అవకాశం కల్పించారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికైన ఫార్మసిస్ట్‌లకు నెలకు రూ.25 వేల వరకు, అసిస్టెంట్‌లకు రూ.16 వేల వరకు వేతనం అందించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవాలని నిరుద్యోగ యువతకు సూచించారు.
అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో పాటు అవసరమైన పత్రాలను తీసుకుని నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. ఉద్యోగ మేళాలోనే ప్రాథమిక ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మెడ్ ప్లస్ మానవ వనరుల విభాగ ప్రతినిధి సాయి శైలేష్‌ను సంప్రదించవచ్చని యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో చీఫ్ టి. రాము తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.