manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 November 2025, 2:05 am Editor : Mana Praja Prathinidhi

10 గ్యాంగులకు చెందిన 86 మంది బైండోవర్

చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరిక
అదనపు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదాలో విచారణ
బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 126 కింద బైండోవర్ చర్య
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలే
హైదరాబాద్, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):
నగర శాంతిభద్రతలను భంగం చేస్తున్న అసాంఘిక గ్యాంగులపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కఠినమైన చర్యలు తీసుకున్నారు. సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్‌లలో ఆధిపత్య పోరు, హత్యలు, హత్యాయత్నాలు, ప్రత్యర్థి గ్యాంగులపై దాడులు చేస్తున్న 10 ప్రధాన ముఠాలకు చెందిన 86 మందిని కమిషనర్ బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 126 కింద బైండోవర్ చేశారు. సజ్జనర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో ప్రత్యేక విచారణను నిర్వహించారు. టీజీఐసీసీసీ కార్యాలయానికి పిలిపించిన గ్యాంగ్ సభ్యుల నుంచి ఒక సంవత్సరం పాటు ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడమని సెక్యూరిటీ బాండ్లు తీసుకున్నారు. సత్ప్రవర్తనతో ఉంటామని గ్యాంగ్ సభ్యులు కోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు. మరల ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే “బాండ్ రద్దు – వెంటనే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు” అని సీపీ సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ విచారణలో స్పెషల్ బ్రాంచ్ డీసీపీ కె. అపూర్వారావు, సంబంధిత పోలీస్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. నగర శాంతి వాతావరణాన్ని కాపాడడం కోసం ఈ చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు.నగర భద్రతను కాపాడడంలో హైదరాబాద్ పోలీస్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ప్రజల్లో భరోసా కలిగించేలా ఉందని పోలీసులు పేర్కొన్నారు.