manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 25 November 2025, 8:16 am Editor : Mana Praja Prathinidhi

యాపిల్‌ సేల్స్‌ విభాగంలో ఉద్యోగుల కోత

హైదరాబాద్‌, నవంబర్‌ 25, మనప్రజాప్రతినిధి:
ప్రపంచ వ్యాప్తంగా టెక్‌ రంగం ఆర్థిక ఒత్తిడులతో కుదేలవుతున్న వేళ, ప్రముఖ కంపెనీలు ఖర్చులను తగ్గించేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి అనేక సంస్థలు విడతలవారీగా ఉద్యోగాల కోతకు దిగిన సంగతి తెలిసిందే. ఇదే వరసలో తాజాగా యాపిల్‌ కూడా చేరింది.
బ్లూమ్‌బర్గ్‌ వెలువరించిన వివరాల మేరకు, యాపిల్‌ తన సేల్స్‌ విభాగంలో కొంతమంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. అయితే ఈ కోత పరిమితంగానే ఉండనున్నట్లు సమాచారం. అమ్మకాల విభాగంలో వ్యూహాత్మక మార్పులు చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఇతర విభాగాల్లో యాపిల్‌ నియామక ప్రక్రియను కొనసాగించనుంది. ఉద్యోగాలు కోల్పోయే వారు సంస్థలోని ఇతర విభాగాల్లో అందుబాటులో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించినట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.
గత కొన్నేళ్లుగా విస్తృత స్థాయి లేఆఫ్స్ చేయని యాపిల్‌ ఈసారి కూడా కేవలం లక్ష్యిత విభాగంలో స్వల్ప కోతకు మాత్రమే మొగ్గుచూపడం విశేషం. ఖర్చు తగ్గింపు చర్యలతో పాటు వ్యాపార వ్యూహాలను పునర్వ్యవస్థీకరించేందుకు సంస్థ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.