manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 2:03 pm Editor : Mana Praja Prathinidhi

బిగ్‌బాస్‌లో నో ఎలిమినేషన్ మలుపు..

– నామినేట్ అయినవాళ్లంతా ఈ వారం సేఫ్

హైదరాబాద్‌, నవంబర్ 23, మనప్రజాప్రతినిధి:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్‌కు కేవలం కొన్ని వారాలే మిగిలి ఉన్న సమయంలో మరో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ప్రతి వారాంతం ఎవరెవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే వేళ, ఈ వారం మాత్రం ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా షోను కొనసాగించాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వారం నామినేషన్ లిస్టులో ఇమ్మాన్యుయేల్, దివ్య, సంజనా, డీమన్ పవన్, భరణి, కళ్యాణ్ ఉన్నారు. ఓటింగ్ ట్రెండ్‌ల ప్రకారం కళ్యాణ్ టాప్‌లో కొనసాగగా, భరణి, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ మిడ్ రేంజ్‌లో ఉన్నారు. చివరి స్థానాల్లో దివ్య, సంజనా ఉండటంతో దివ్య ఈసారి బయటకు వెళ్తుందని చాలా మంది అంచనా వేశారు. కానీ ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఈ వారం ఎలిమినేషన్ ఉండదని ప్రచారం జరిగిపోవడంతో, దివ్యతో పాటు మిగతా కంటెస్టెంట్లంతా మరో వారం హౌస్‌లో కొనసాగనున్నారు.
ఇటీవల హౌస్‌లో దివ్య, తనూజ మధ్య జరిగిన ఘర్షణ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. మాటల యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్లి, కొట్టుకునే దాకా చేరడంతో ఈ ఎపిసోడ్‌కు టీఆర్పీ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ ఫైట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. “ఇలాంటి సీన్స్ ఉన్నప్పుడు దివ్యను ఎలిమినేట్ చేస్తారా?”, “టీఆర్పీ కోసం నో ఎలిమినేషన్ పెట్టారు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
బిగ్ బాస్ ఇప్పటికే గత సీజన్లలోనూ ఇలాంటి మలుపులు చూపించాడు. ఫైనల్ దశకు చేరేకొద్దీ కంటెస్టెంట్ల ఆటతీరు మరింత ఉత్సాహంగా మారుతుంది. ఈ నో ఎలిమినేషన్ నిర్ణయంతో హౌస్‌లో పోటీ మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఇక వచ్చే వారం ఎలాంటి ట్విస్ట్ ఇస్తారోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.