manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 2:09 pm Posted by : Mana Praja Prathinidhi

ఢిల్లీ గాలి విషంగా మారుతోంది..

– కృతి సనన్ హెచ్చరికతో కలవరపడుతున్న అభిమానులు

న్యూఢిల్లీ, నవంబర్ 23,మనప్రజాప్రతినిధి:
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం భయంకర స్థాయికి చేరుకుంటోందని బాలీవుడ్ నటి కృతి సనన్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఢిల్లీ ఎలా ఉండేదో తనకు బాగా తెలుసని, కానీ ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిపోయిందని ఆమె పేర్కొన్నారు. తాజాగా తన కొత్త సినిమా ‘తేరే ఇష్క్ మే’ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కృతి ఈ అంశంపై స్పందించారు.
తాను ఢిల్లీ వాసినేనని చెప్పిన కృతి.. ఒకప్పుడు ఇక్కడ శీతాకాలాలు ఎంత ఆహ్లాదంగా ఉండేవో, ఇప్పుడు మాత్రం పొగమంచు, కాలుష్యంతో ఊపిరి తీసుకోవడమే కష్టమవుతోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి ఇంకా దారుణంగా మారే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో మనం పక్కపక్కనే నిలబడ్డా కూడా ఒకరినొకరు కనిపించని స్థితికి చేరుకుంటామని అన్నారు.
ప్రతి ఏడాది నవంబర్ నుంచే ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతోందని, ఇది ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. చిన్న పిల్లలు, వృద్ధులు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తనకు తెలిసిన చాలా మంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని, ఇది కేవలం సాధారణ సమస్య కాదు, భవిష్యత్తు తరాలకే ముప్పుగా మారిందని అన్నారు.
తాను నటించిన ‘తేరే ఇష్క్ మే’ సినిమా ప్రమోషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్న కృతి.. హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో కూడా కాలుష్యం పెరుగుతున్న తీరును గమనిస్తున్నానని చెప్పింది. కానీ ఢిల్లీలో మాత్రం పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ప్రత్యేకంగా పేర్కొంది. ప్రభుత్వం, ప్రజలు కలిసి పని చేయకపోతే ఈ సమస్యకు పరిష్కారం దొరకదని ఆమె అభిప్రాయపడింది.
కృతి చేసిన వ్యాఖ్యలతో ఢిల్లీ వాయు కాలుష్యం అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఆమె మాటలకు విస్తృతంగా స్పందన వస్తోంది. “ఇది సెలబ్రిటీ మాట మాత్రమే కాదు, ప్రతి పౌరుడి గళం” అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఢిల్లీ వాసులు ఇకనైనా కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.