manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 11:12 am Editor : Mana Praja Prathinidhi

వైరాలో యంగ్ ఇండియా సమగ్ర నివాస పాఠశాల శంకుస్థాపన

20 ఎకరాల్లో 200 కోట్లతో అత్యాధునిక విద్యా ప్రాజెక్ట్
ప్రతి నియోజకవర్గంలో ఒక సమగ్ర పాఠశాల లక్ష్యం
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యం
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

వైరా, 22 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
వైరా నియోజకవర్గంలో 20 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా సమగ్ర నివాస పాఠశాల శంకుస్థాపన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమనే దృక్పథంతో ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. వైరాలో నిర్మిస్తున్న ఈ పాఠశాల భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, తెలంగాణ విద్యా రంగంలో గేమ్ చెంజర్‌గా అవతరిస్తుందని  నమ్మకం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సమగ్ర నివాస పాఠశాల మోడల్ దేశంలో ఎక్కడా లేనిదని ఆయన పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని గుర్తుచేసిన భట్టి విక్రమార్క, వైరా ప్రాజెక్ట్‌ను అత్యాధునిక సదుపాయాలతో వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు క్యాంపస్‌లోనే నివసించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి పాఠశాల నిర్వహణను సమగ్రంగా రూపొందిస్తున్నట్టు వివరించారు.క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలకు పాఠశాలలో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఎదగడానికి కావలసిన అన్ని సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే రూ.30 కోట్లు జమ చేశామని, పనులు వేగంగా సాగేందుకు ప్రతి పదిహేను రోజులకు నిధులు విడుదల చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేసే విధానాన్ని అమలు చేస్తూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే పద్ధతిని అభివృద్ధి చేశారని తెలిపారు.విద్యతోనే సమాజం ఎదుగుతుందని, విద్యార్థుల భవిష్యత్తు బలపడేలా ప్రజా ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.