– రెండో పెళ్లి లేదంటూ సూటి క్లారిటీ
హైదరాబాద్, నవంబర్ 23, మనప్రజాప్రతినిధి:
దక్షిణాది సినిమా రంగంలో అందం, అభినయంతో సంవత్సరాల పాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి మీనా మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుసగా భారీ చిత్రాల్లో నటించిన మీనా, ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలతో తన సత్తా చాటుతోంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి మెగాస్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అందాల తార, పెళ్లి తర్వాత కూడా సినిమాలకు దూరం కాకుండా కెరీర్‌ను కొనసాగిస్తోంది.
అయితే, భర్త మరణం తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో ఎక్కడలేని ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మీనా రెండో పెళ్లి చేసుకుంటోందంటూ, ఆమెకు సంబంధం ఉందంటూ అడ్డమీద లేని ప్రచారాలు తెగ హల్‌చల్ చేయసాగాయి. కొంతకాలంగా ఈ రూమర్లు మరింత పెరగడంతో చివరకు మీనా స్వయంగా స్పందించారు. ప్రస్తుతం నేను నా కుమార్తెతో చాలా సంతోషంగా జీవిస్తున్నాను. నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. ఏ హీరో విడాకులు తీసుకున్నా, దానికి నన్ను లింక్ చేసి వార్తలు రాయడం చాలా బాధ కలిగిస్తోంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు పూర్తిగా తన కెరీర్‌పైనే దృష్టి పెట్టానని, ఇలాంటి పుకార్లకు ఇకపై చోటివ్వనని కూడా స్పష్టం చేశారు.
వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా, కెమెరా ముందు మాత్రం చిరునవ్వు కోల్పోకుండా అభిమానులను అలరిస్తున్న మీనా, ప్రస్తుతం పలు భాషల్లో చిత్రాల్లో నటిస్తున్నారు. మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి రూపొందుతున్న ‘దృశ్యం 3’ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆమె, అదే సమయంలో తమిళంలో ‘మూకుత్తి అమ్మన్ 2’, ‘రౌడీ బేబి’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. ‘దృశ్యం’ తెలుగు వెర్షన్‌లో నటించిన ఆమె, ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్‌లో కూడా కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
పాత్రల ఎంపిక విషయంలో కూడా మీనా ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాప పుట్టిన రెండేళ్లకే ‘దృశ్యం’ కోసం అడిగారని, కానీ అప్పట్లో చేయలేకపోయానని చెప్పిన ఆమె, తర్వాత కథ నచ్చడంతో ఆ సినిమాకు ఓకే చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కూడా కేవలం కంటెంట్, పాత్ర సంతృప్తి కలిగిస్తేనే సినిమాలు చేస్తానని, నచ్చని పాత్రలకు నో చెప్పడానికి ఏ మాత్రం వెనకాడను అని ఆమె స్పష్టం చేశారు.
ఇక మొత్తానికి, మీనా రెండో పెళ్లి అన్న మాటలకు ఆమె స్పష్టంగా ఫుల్‌స్టాప్ పెట్టడంతో, అభిమానుల్లో కూడా కొంత ఊరట కనిపిస్తోంది. ఉద్యోగ, కుటుంబ జీవితాన్ని సమతూకంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ నటి నిర్ణయాన్ని అభిమానులు గౌరవిస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.