సదాశివపేట, నవంబర్ 26 (మన ప్రజా ప్రతినిధి)
సదాశివపేట మండలం గొల్లెగూడెం గ్రామంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను బుధవారం సాయంత్రం టీజీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాటికశాల జోగయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, “పేదవారి కోసం సేవ చేయాలనే ఆలోచనతో ఫౌండేషన్‌ను స్థాపించడం ఎంతో గొప్ప పని. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేని విద్యార్థులకు ఉన్నత విద్య అందించడమే అమ్మ ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం కావడం అభినందనీయం” అని పేర్కొన్నారు. నాటికశాల జోగయ్య సేవా భావాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు.
తరువాత జోగయ్య మాట్లాడుతూ, గ్రామంలో జన్మించే ప్రతి ఆడశిశువుకు బాలింతలకు కిట్‌తో పాటు రూ.3,000 ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. పేద విద్యార్థులకు విద్యాసాయం, ఉచిత ఆరోగ్య శిబిరాలు, రక్తదాన క్యాంపులు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడం అమ్మ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని వివరించారు.గ్రామాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమం, ఆరోగ్యం, విద్య రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను త్వరలో చేపడతామని జోగయ్య ప్రకటించారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.