న్యూఢిల్లీ, నవంబర్ 24,మనప్రజాప్రతినిధి:
దేశవ్యాప్తంగా అమలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్న కొత్త కార్మిక చట్టాలు ఉద్యోగుల జీతభత్యాల నిర్మాణాన్ని పూర్తిగా మార్చనున్నాయి. ప్రైవేట్ రంగం నుంచి ప్రభుత్వ రంగం వరకు, శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, మీడియా, కర్మాగారాలు, తోటల రంగాల్లో పనిచేసేవారికి కూడా ఈ నిబంధనలు వర్తించనున్నాయి. కొత్త విధానాల ప్రకారం ఉద్యోగుల మొత్తం వేతనంలో కనీసం సగం వరకు మౌలిక జీతంగా ఉండేలా కంపెనీలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అనేక సంస్థలు మౌలిక జీతాన్ని తక్కువగా ఉంచి, అలవెన్సుల రూపంలో ఎక్కువగా చూపించే పద్ధతిని పాటించగా, ఈ విధానం ఇకపై చెల్లుబాటు కాకపోనుంది.
మౌలిక జీతం పెరగడం వల్ల భవిష్య నిధి, గ్రాట్యుటీ వంటి కాంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. ఈ మొత్తాలు జీతం నుంచి నేరుగా కట్టివేయబడే కారణంగా ఉద్యోగుల చేతికి వచ్చే నెలవారీ జీతం కొంత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీర్ఘకాలికంగా చూసుకుంటే ఉద్యోగుల సామాజిక భద్రత మరింత బలపడుతుందని, రిటైర్మెంట్ సమయంలో లభించే లాభాలు పెరుగుతాయని వారు చెబుతున్నారు.
కొత్త కార్మిక చట్టాలు కేవలం వేతనాలకే పరిమితం కాకుండా, పనివేళలు, సెలవులు, లింగ వివక్ష, భద్రత వంటి అంశాలపై కూడా కీలక మార్పులు తీసుకొస్తున్నాయి. కేంద్రం నిర్ణయించే కనీస వేతన పరిమితికి దిగువగా ఏ రాష్ట్రం కూడా కనీస జీతాన్ని నిర్ధారించకూడదని స్పష్టతనిచ్చింది. నియామకాలలో, జీతాల నిర్ణయంలో లింగ వివక్షకు తావుండదని, మహిళలకు వారి అంగీకారంతో రాత్రి పూట పనిచేసే అవకాశం కల్పిస్తున్నట్లు చట్టంలో పేర్కొన్నారు.
అలాగే గిగ్, ప్లాట్‌ఫామ్ ఉద్యోగుల భద్రత కోసం కంపెనీలు తమ వార్షిక టర్నోవర్‌లో శాతం మేర సామాజిక భద్రతా నిధికి చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్‌టైం చేసే వారికి సాధారణ వేతనానికి రెట్టింపు చెల్లించాల్సిన నిబంధనను కూడా చేర్చారు. పని గంటల పరిమితి రోజుకు ఎనిమిది గంటలు, వారానికి నలభై ఎనిమిది గంటలుగానే కొనసాగుతుంది.
కొత్త చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత కొంతకాలం ఉద్యోగులు, సంస్థలు కొత్త వ్యవస్థకు అలవాటు పడాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. చేతికి వచ్చే జీతం కొద్దిగా తగ్గినా, దీర్ఘకాలిక భద్రత, పెరిగే భవిష్య లాభాల కోసం ఈ మార్పులు అవసరమని ప్రభుత్వవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.