ప్రజా ప్రతినిధి – శ్రీకాళహస్తి నియోజకవర్గం. నవంబర్ 26
శ్రీకాళహస్తి మండలం వేలంపాడు వద్ద ఉన్న సోమని టైల్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ పేలుడు జరిగిన ఘటన స్థానిక ప్రజలను కలవరపరచింది. ఈ ప్రమాదంలో చీరాలకు చెందిన కార్మికుడుపోతురాజు,ఒడిశాకుచెందిన పాండే అనే ఇద్దరు కార్మికులు మృతి చెందడం పరిశ్రమలలో నెలకొన్న భద్రతా లోపాలను మరోసారివెలుగులోకితెచ్చింది.ఉద్యోగుల భద్రత పట్ల ఫ్యాక్టరీ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నదని, కార్మికులకు హెల్మెట్, బూట్లు, సేఫ్టీ జాకెట్ల వంటి రక్షణ పరికరాలు అందించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్యాస్ లీకేజీ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరికొంత మంది గాయపడ్డారని తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని వెంకటగిరి ఆసుపత్రికి తరలించడం సరైన చర్య కాదని, వారిని వెంటనే చెన్నై అపోలో వంటి మెరుగైన వైద్యసౌకర్యాలున్న ఆసుపత్రులకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరణించిన కార్మికుల కుటుంబాలకు కనీసం ₹25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఆయన హెచ్చరించారు. లేనిపక్షంలో ఫ్యాక్టరీ ముందు భారీ స్థాయిలో ఆందోళన చేసేందుకు సిద్ధమని స్పష్టంచేశారు.ఇకపైనైనా స్టీల్ ప్లాంట్లు, టైల్స్ పరిశ్రమలు కార్మికుల భద్రతను మూల్యం చేసుకుని పనిచేయాలనే డిమాండ్ స్థానికంగా గళమెత్తుతోంది. చుట్టుపక్కల గ్రామాల్లో పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యంతో ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
కార్మికుల ప్రాణాలపై నిర్లక్ష్యం చూపితే ఇక మౌనం ఉండబోమని స్థానిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి..