కర్మ హిట్స్ బ్యాక్
– జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత కవిత వివాదాస్పద ట్వీట్ చర్చనీయాంశం
– పేర్లు ప్రస్తావించకుండా చేసిన మూడు పదాల ట్వీట్ రాజకీయ వేడి పెంచింది
– బీఆర్ఎస్ ఉప ఎన్నిక ఓటమి నేపథ్యంతో వ్యాఖ్యానమా అనే సందేహాలు
– కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో ట్వీట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత
(హైదరాబాద్, నవంబర్ 14) (మనప్రజాప్రతినిధి):జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల్లో రాజకీయం రగులుతుండగా, కల్వకుంట్ల కవిత చేసిన ఒక చిన్న ట్వీట్ పెద్ద చర్చకు దారి తీసింది. “కర్మ హిట్స్ బ్యాక్” అంటూ ఎక్స్ వేదికపై ఆమె పోస్ట్ చేసిన మూడు పదాల ట్వీట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏ నేత, ఏ పార్టీ పేరునూ ప్రస్తావించకుండా చేసిన సందేశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేలకుపైగా మెజారిటీతో విజయం సాధించగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భారీ తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిలో కవిత చేసిన ట్వీట్ బీఆర్ఎస్ ఓటమిని లక్ష్యంగా చేసుకున్నదా? లేక కాంగ్రెస్ విజయంపై వ్యంగ్యమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, కవిత ‘కర్మ’ అనే పదాన్ని ప్రస్తావించడం ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. తాజా రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ అంతర్గత పరిస్థితులు, ఉప ఎన్నిక ఫలితాల్లో వచ్చిన భారీ తేడా ఈ ట్వీట్‌ను మరింత ప్రాధాన్యంతో నిలబెట్టాయి. కేవలం మూడు పదాల ట్వీట్ అయినప్పటికీ, దాని వెనుక రాజకీయ సందేశం దాగివున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గణాంకాలను పరిశీలిస్తే, కాంగ్రెస్ ముందంజ మొదటి రౌండ్ నుంచే స్పష్టమైంది. చివరి లెక్కింపు వరకు అదే ఆధిపత్యం కొనసాగింది. అలాంటి సందర్భంలో కవిత ట్వీట్ చేయడం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మపరిశీలనకు దారి తీసే సూచికగా కొందరు భావిస్తున్నారు. మరికొందరు దీనిని కవిత వ్యక్తిగత అభిప్రాయంగా భావిస్తుండగా, కొంతమంది రాజకీయ విశ్లేషకులు దీనిని భవిష్యత్ బీఆర్ఎస్ వ్యూహాలకు సంకేతంగా కూడా అంచనా వేస్తున్నారు. మొత్తం మీద, కేవలం మూడు పదాలే అయినా కవిత ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరతీసింది