manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 2:40 pm Editor : Mana Praja Prathinidhi

శంకర సముద్రం రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలపై కవిత ఆరా

– వనపర్తి కొత్తకోట–కానాయిపల్లి ప్రాంతంలో జాగృతి పర్యటన
– నిర్వాసితుల జీవన పరిస్థితులపై ప్రత్యక్ష సమాచారం సేకరణ
– ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

కొత్తకోట, 23 నవంబర్ (మనప్రజాప్రతినిధి): వనపర్తి జిల్లా కొత్తకోట–కానాయిపల్లి పరిధిలోని శంకర సముద్రం రిజర్వాయర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. రిజర్వాయర్ నిర్మాణంతో ప్రభావితమైన నిర్వాసితులను ప్రత్యక్షంగా కలిసిన ఆమె, వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు.
రిజర్వాయర్ కారణంగా ఇళ్లు, భూములు కోల్పోయిన ప్రజల బాధలను విన్న కవిత, పునరావాసం, పరిహారం, జీవనోపాధి వంటి అంశాల్లో ఉన్న లోపాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని హామీ ఇచ్చారు. పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరత, తాగునీటి సమస్యలు, పంట భూముల కోల్పోవడం వల్ల వచ్చిన ఇబ్బందులను ప్రజలు ఆమెకు వివరించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రాజెక్ట్‌ల వల్ల ప్రభావితులైన ప్రజలకు ప్రభుత్వం సరైన రీతిలో అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. నిర్వాసితుల సమస్యలను అధికారులు శీఘ్ర పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని, జాగృతి తరఫున వారికి పూర్తి మద్దతు అందిస్తామని తెలిపారు.
శంకర సముద్రం రిజర్వాయర్ పర్యటనలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ సమస్యలు, ఆశలు–ఆకాంక్షలను కవితకు తెలియజేశారు.