– అలేటి మహేశ్వర్ రెడ్డి, పవార్ రామారావు పాటిల్, ఈటెల రాజేందర్ కలిసి వినతులు
– హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలపై కేంద్ర స్థాయి దృష్టి అవసరమని అభ్యర్థన
– ఉప్పల్–కొంపల్లి ఫ్లైఓవర్ పనులకు వేగం పెంచుతామని నితిన్ గడ్కరీ హామీ
(నాగపూర్, నవంబర్ 16) (మనప్రజాప్రతినిధి):
మహారాష్ట్రలోని నాగపూర్‌లో రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బీజేపీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్‌తో పాటు ఈటెల రాజేందర్ కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌లు, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, వాటి పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర సమన్వయం పెంచాల్సిన అవసరంపై నేతలు మంత్రి తో విస్తృతంగా చర్చించారు.
హైదరాబాద్‌కు కోట్లలో జనాభా, రోజూ మరో అరకోటికి పైగా ప్రజలు వచ్చి వెళ్లే పరిస్థితిలో రద్దీ తీవ్రత పెరుగుతున్నదని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫీసు సమయాల్లో ట్రాఫిక్ జామ్‌లు ప్రజల పనితీరునే దెబ్బతీస్తున్నాయని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు తగినంతగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇబ్బందులు అధికమయ్యాయని వివరించారు. ఉప్పల్ ఫ్లైఓవర్, కొంపల్లి ఫ్లైఓవర్ వంటి ముఖ్య ప్రాజెక్టులు నత్తనడకన సాగడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు.
ఈటెల రాజేందర్ సహా నాయకులు కలసి, వరంగల్ హైవేలో ఉన్న ఉప్పల్ ఫ్లైఓవర్ మరియు నిజామాబాద్ హైవేలోని కొంపల్లి ఫ్లైఓవర్ పనులను అత్యవసరంగా వేగవంతం చేయాలని నితిన్ గడ్కరీ ని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ వెంటనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రాజెక్టుల డెడ్‌లైన్లు ఎన్నోసార్లు దాటిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని నేతలు కోరినట్లు సమాచారం.
బాలానగర్ నరసాపూర్ హైవేలో వేగంగా పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో కొత్త ఫ్లైఓవర్ అవసరం ఉందని నాయకులు సూచించారు. అలాగే నాగార్జునసాగర్ క్రాస్ రోడ్ నుండి అమరావతి వరకు నిర్మాణంలో ఉన్న కొత్త హైవేపై భవిష్యత్తులో రద్దీ మరింత పెరుగవచ్చని, అందువల్ల సాగర్ ఎక్స్ రోడ్ వైపు కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని వినతిపత్రం అందించారు. దీనిపై మంత్రి అంగీకారం తెలుపుతూ త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.