హైదరాబాద్,(నవంబర్ 22మనప్రజాప్రతినిధి):
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన సినీ ప్రయాణానికి విరామం ఇచ్చి, కొత్తగా సంగీత ప్రపంచంలో అడుగు పెట్టారు. చాలా ఏళ్లుగా తన హృదయంలో దాచుకున్న స్వప్నం నేడు నిజమైంది. శనివారం ఆయన కొత్త మ్యూజిక్ లేబుల్ ‘మోహన రాగ మ్యూజిక్’ అధికారికంగా ప్రారంభమైంది. సంగీతం తనకు ఎప్పుడూ ఓ ఆశ్రయం, ఓ భావప్రకటన అని మనోజ్ భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.
మనోజ్ తెలిపిన వివరాల ప్రకారం—ఈ మ్యూజిక్ లేబుల్ కొత్త తరానికి వేదికగా, ధైర్యంగా ఆలోచించే సంగీత యువతకు అవకాశాలను అందించేందుకు రూపొందించబడింది. “లోకల్ హార్ట్స్, గ్లోబల్ బీట్” అన్న నినాదంతో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లనున్నట్టు ఆయన చెప్పారు.
సంగీతంపై మనోజ్‌కున్న ప్రేమ కొత్తది కాదు. *‘పోటుగాడు’*లో “ప్యార్ మే పడిపోయా” పాటను స్వయంగా పాడిన మనోజ్, కరోనా సమయంలో విడుదల చేసిన “అంతా బాగుంటాండ్రా” పాటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే పిస్తా పిస్తా, ఎన్నో ఎన్నో, ప్రాణం పోయే బాధ వంటి పాటలకు సాహిత్యం కూడా రాశారు.
తండ్రి మంచు మోహన్ బాబు, అన్న విష్ణు, అక్క లక్ష్మీ మంచు—ఈ కుటుంబానికి సంగీతం, సినిమా పట్ల ఉన్న అనుబంధమే ‘మోహన రాగ’ అనే పేరుకి ప్రేరణగా ఉందని ఆయన పేర్కొన్నారు. హాలీవుడ్ చిత్రం కోసం అచ్చు రాజమణితో కలిసి పనిచేసిన అనుభవం తన సంగీత ప్రయాణంలో ప్రత్యేకమైనదన్నాడు.
అంతర్జాతీయ స్థాయిలో కొత్త ప్రాజెక్టులు రూపొందుతున్నాయని, వాటిని త్వరలో ప్రకటించనున్నట్టు మనోజ్ తెలిపారు. తెలుగు సంగీతాన్ని ప్రపంచానికి మరింత దగ్గర చేయడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
సినిమా తార నుంచి సంగీత సృష్టికర్తగా మారిన మనోజ్ కొత్త మ్యూజిక్ ప్రయాణం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.