manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 4:27 pm Editor : Mana Praja Prathinidhi

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలు 13 నెలలుగా పెండింగ్

ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ హరీశ్ రావు డిమాండ్
“కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం” అన్న వాగ్దానం ఎక్కడ?
కార్మికుల అరుపులు వినాలని ప్రభుత్వంపై హెచ్చరిక
బకాయిల చెల్లింపులో జాప్యం మహిళలపై భారమని విమర్శ

హైదరాబాద్, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):

మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు 13 నెలలుగా జీతాలు, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం “కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం” అంటూ ఇచ్చిన హామీ ఇప్పటికీ మాటలకే పరిమితమైందని ఆయన విమర్శించారు. మొత్తానికి జీవనోపాధి కోసం పనిచేస్తున్న మహిళా కార్మికులు ఇప్పుడు “అప్పుల పాలయ్యాం… మొర్రో” అంటూ బాధలు వెల్లగక్కుతున్నారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. పేద కుటుంబాలకు చెందిన ఈ కార్మికుల జీతాలు నెలల తరబడి నిలిపివేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పాఠశాల విద్యార్థుల కోసం అత్యంత కీలకమైనదని, ఈ పథకాన్ని ముందుకు నడిపే మహిళలకు కనీస గౌరవం, ఆర్థిక భరోసా కూడా ఇవ్వని ప్రభుత్వం విఫలమైందని హరీశ్ రావు మండిపడ్డారు. బకాయిలను వెంటనే చెల్లించాలని, ఇకపై ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ముందు డిమాండ్ చేశారు.