manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 3:51 pm Editor : Mana Praja Prathinidhi

తెలంగాణ నీటి హక్కులపై కేంద్రంలో స్పష్టత కోరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

న్యూఢిల్లీ, నవంబర్ 19 (మనప్రజాప్రతినిధి):

పాలమూరు,రంగారెడ్డి, సమ్మక్క సాగర్ అనుమతులు పెండింగ్ కృష్ణా జలాల విభజన తీర్పు వేగవంతం చేయాలన్న విజ్ఞప్తిపోలవరంలింక్‌, అల్మట్టి ఎత్తు పెంపుపై తెలంగాణ అభ్యంతరంతెలంగాణ నీటి హక్కులు, సాగు ప్రాజెక్టుల అనుమతులపై రాష్ట్రం చాటి చెబుతున్న ఆందోళనలను మరోసారి కేంద్రానికి వివరించింది. జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌ను కలిసిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కృష్ణా–గోదావరి ప్రవాహ ప్రాంతాలకు సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించారు. అనేక ప్రతిపాదనలు, నివేదికలు కేంద్ర నీటి కమిషన్‌లో చాలాకాలంగా పెండింగ్‌లో ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్‌ పథకం, సమ్మక్క సాగర్‌కు సంబంధించిన అనుమతులు నెలల తరబడి ఆగిపోయాయని మంత్రి తెలిపారు. రెండు ప్రాజెక్టులూ రాష్ట్రంలోని ఎండబారిన ప్రాంతాలకు జీవనాధారంగా మారనుండగా, కేంద్రంలో జరుగుతున్న ఆలస్యం రైతుల ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు. వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. కృష్ణా జలాల విభజనపై బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఆలస్యమవడం వలన అనేక సాగు పథకాలు నిలిచిపోయాయని మంత్రి గుర్తుచేశారు. కృష్ణా నదీ జలాల న్యాయమైన పంచాయితీ కోసం ట్రైబ్యునల్‌ విచారణలను వేగవంతం చేయాలని సూచించారు. దీనివల్ల తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ స్పష్టతగా జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం–బణకచర్ల లింక్‌ ప్రాజెక్టు వరదనీటిపై ఆధారపడి రూపొందించబడిందని, ఇది జాతీయ ప్రమాణాలకు విరుద్ధమని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయని మంత్రి జలశక్తి మంత్రికి రాతపూర్వకంగా, ప్రత్యక్షంగా తెలిపారని వివరించారు.
అలాగే కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి ప్రాజెక్టు నీటి మట్టాన్ని 519 మీటర్ల నుంచి 594 మీటర్లకు పెంచే యోచనపై తెలంగాణ బలమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. అల్మట్టి ఎత్తు పెరిగితే తెలంగాణకు లభించే హక్కు నీరు తగ్గిపోతుందని మంత్రి తెలిపారు. దీనిపై కేంద్రం మధ్యవర్తిత్వం చేసి కర్ణాటకకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. తెలంగాణలో సాగు విస్తరణకు, నీటి వినియోగ హక్కుల బలపరచడానికి రాష్ట్రం సమర్పించిన పలు ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక సహాయం అవసరమని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్టుల వివరాలను కేంద్రానికి అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆయన కోరారు.