manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 November 2025, 2:00 am Posted by : Mana Praja Prathinidhi

హిందూపురం పర్యటనలో నారా బ్రాహ్మణి

పాఠశాలలకు హెరిటేజ్ సంస్థ భారీ విరాళాలు
“హిందూపురం అంటే నందమూరిపురం” – బ్రాహ్మణి వ్యాఖ్య
పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రింటర్లు అందజేసిన హెరిటేజ్ ఫుడ్స్
చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండలాల్లో విస్తృత పర్యటన
హిందూపురం, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):
హిందూపురం నియోజకవర్గానికి రావడం తన పుట్టింటికి వస్తున్నంత ఆనందంగా ఉందని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె శనివారం చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండలాల్లో పర్యటించి ప్రజలను పలకరించారు. పర్యటనలో భాగంగా హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర అవసరమైన ఉపకరణాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “హిందూపురం అంటే నందమూరిపురం. మా తాత నందమూరి తారకరామారావు, పెదనాన్న హరికృష్ణ, తండ్రి బాలకృష్ణ ఈ నేలకు ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గం మా కుటుంబంతో ఉన్న బంధం ఎంతో ప్రత్యేకం” అని ఆమె గుర్తుచేశారు. విద్యారంగ అభివృద్ధికి భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. విద్య అనేది విలువలతో కూడి ఉండాలని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు మంచి అవకాశాలు సృష్టించుకోవడానికి మౌలిక వసతులు బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే ఈ విరాళాలను అందజేస్తున్నామని బ్రాహ్మణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిలమత్తూరు జూనియర్ కళాశాల, లేపాక్షి మండలం కుర్లపల్లి, పూలకుంట ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ముఖ్యంగా లేపాక్షి నవోదయ పాఠశాలలో హెరిటేజ్ సంస్థ ఏర్పాటు చేసిన సోలార్ గీజర్ వ్యవస్థను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమెకు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. పర్యటనలో టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.