manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 6:45 pm Editor : Mana Praja Prathinidhi

కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసు

  • నిరసన ర్యాలీ సందర్భంగా టీడీపీ నేతలపై వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణ
  • కౌన్సిలర్ ఫిర్యాదు ఆధారంగా 4 సెక్షన్ల కింద కేసు నమోదు
  • పోలీసుల చర్య ఏకపక్షమని వైసీపీ నేతల విమర్శ

(తాడిపత్రి, నవంబర్ 14) (మనప్రజాప్రతినిధి):

తాడిపత్రికి చెందిన వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. నవంబర్ 12న జరిగిన నిరసన ర్యాలీ సందర్భంలో పోలీసుల సమక్షంలో టీడీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఈ కేసు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఏపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి నేతృత్వంలో ఆ రోజు ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీని పోలీసులు, టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పోలీసులు వ్యవహారశైలిని తప్పుబట్టడంతో పాటు టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలను అనుచితమని ఆరోపిస్తూ టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తాడిపత్రి పోలీసులు IPC 296, 79, 351(2), 351(3) సెక్షన్ల కింద కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఘటనపై మరింత విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, జేసీ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని దూషించినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. ఒకే తరహా ఘటనల్లో పోలీసుల వైఖరి వేరేలా ఉండటం ఆందోళన కలిగిస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. తాడిపత్రిలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతుండగా, రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పిస్తున్నారు.