– రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ఏర్పాటు
– ఓవర్‌లోడింగ్, ఓవర్‌స్పీడ్ వాహనాలపై సీజ్ ఆదేశాలు
– ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, ట్రాక్టర్లపై వేధింపులు చేయవద్దని ఆదేశం
– రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్
(హైదరాబాద్, నవంబర్ 12) (మనప్రజాప్రతినిధి):
రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం ఆయన రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు జిల్లా స్థాయిలో 33 ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్, రాష్ట్ర స్థాయిలో మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి నిబంధనల ఉల్లంఘనకు తావివ్వం. ఫిట్‌నెస్ గడువు ముగిసిన వాహనాలు, ఓవర్‌స్పీడ్ వాహనాలు, సీసీ బస్సులను సీజ్ చేయాలి. టిప్పర్లు, ట్రాలీలు టార్పాలిన్‌తో కప్పకుండా వస్తే చర్యలు తీసుకోవాలి” అని స్పష్టం చేశారు. గత వారం చేవెళ్ల ప్రమాదం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 2,576 వాహనాలపై కేసులు నమోదు చేశామని, అందులో 352 లారీలు, 43 బస్సులు ఉన్నాయని వెల్లడించారు.
– ఆటోలు, ట్రాక్టర్లపై వేధింపులు చేయొద్దు
ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్ల డ్రైవర్లను అధికారాలు వేధించరాదని మంత్రి పొన్నం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. “వారిని బాధపెట్టడం కాకుండా, అవగాహన కల్పించాలి. కానీ భద్రతా నిబంధనలను విస్మరించిన వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. శాండ్, ఫ్లై యాష్, బిల్డింగ్ మెటీరియల్స్ తరలించే వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేపడతామని తెలిపారు. రోడ్డు భద్రతా మాసం సందర్భంగా వ్యాసరచన పోటీలు, చిల్డ్రన్ అవేర్‌నెస్ పార్క్‌లలో కార్యక్రమాలు, ప్రజా అవగాహన ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. మహిళా ఆటోలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. “ప్రజల ప్రాణ భద్రతే మా ప్రాధాన్యం” అని మంత్రి స్పష్టం చేశారు.