రైతు సంక్షేమమే మా లక్ష్యం: కింజరాపు అచ్చెన్నాయుడు
పంట నుండి మార్కెట్ వరకు ప్రతి దశలో సహాయం
శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడి కోసం శిక్షణ
ఘంటసాల, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే డా. మండలి బుద్ధప్రసాద్, ఉన్నతాధికారులు, ఎన్డీయే కూటమి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ పద్ధతులను చేరువ చేయడమే ఈ వేదిక లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఆధునిక వ్యవసాయంలో రైతులకు అవసరమైన శిక్షణను కృషి విజ్ఞాన కేంద్రాలు అందిస్తాయని అన్నారు. కొత్త పంట రకాలు, అధిక దిగుబడులు సాధించే ఆధునిక సాగు విధానాలు, మార్కెటింగ్ పద్ధతులపై రైతులకు పూర్తి మార్గదర్శకత్వం ఇస్తామని చెప్పారు. “రైతే దేశానికి వెన్నెముక అన్న నినాదాన్ని నిజం చేస్తూ, రైతుల అభ్యున్నతికోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని మంత్రి హామీ ఇచ్చారు. పంట నాటడం నుండి కోయడం, మార్కెటింగ్ వరకు ప్రతి దశలో రైతులకు ప్రభుత్వ సహాయం అందుబాటులో ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. సాగులో ఎదురయ్యే సమస్యలపై రైతుల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. “మన రైతుల కష్టానికి తగ్గ మంచి ఫలితం తప్పకుండా వస్తుంది” అని మంత్రి రైతులను ధైర్యం చెప్పారు. ఘంటసాలలో రైతులు వ్యక్తం చేసిన ఆనందం చూసి మరింత ప్రేరణ పొందినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు శాస్త్రీయ సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. “మీ మంత్రిగా, నేను ఎల్లప్పుడూ రైతు పక్షమే” అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.