యువత కోసం 1M1B గ్రీన్ ఇంటర్న్‌షిప్ ప్రకటించిన భువనేశ్వరి
స్థిరమైన అభివృద్ధి, సాంకేతిక నైపుణ్యాలకు ప్రోత్సాహం
యువత భవిష్యత్తు నిర్మాణంలో కీలక అవకాశాలు
కుప్పం, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన సంస్థ వన్ మిలియన్ వన్ బిలియన్ బృందంతో సంభాషించడం ఆనందమేసిందని నారా భువనేశ్వరి తెలిపారు. కుప్పంలో ‘1.5 మ్యాటర్స్’ క్లైమేట్ యాక్షన్ ఉద్యమాన్ని ప్రారంభించడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ కార్యక్రమం కుప్పం నుంచి ఆరంభమవడం విశేషమన్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నివారణ పై యువతలో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ ఉద్యమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల పాల్గొనడం, శిక్షణ కార్యక్రమాలు, స్థానిక స్థాయిలో పర్యావరణ చర్యలు ఈ ఉద్యమంలో భాగంగా ఉంటాయి.
ఈ కార్యక్రమం సందర్భంగా కుప్పంలో వన్ మిలియన్ వన్ బిలియన్ గ్రీన్ ఇంటర్న్‌షిప్ను కూడా నారా భువనేశ్వరి ప్రకటించారు. ఏఐసీటీఈ, సేల్స్‌ఫోర్స్ సహకారంతో అందిస్తున్న ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా యువతకు స్థిరమైన అభివృద్ధి (సస్టైనబిలిటీ), హరిత సాంకేతికత, నూతన డిజిటల్ నైపుణ్యాలపై ప్రత్యక్ష అనుభవం లభించనుంది. “ఆంధ్రప్రదేశ్ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజానికి ఉపయోగపడే విజయవంతమైన కెరీర్‌లు నిర్మించాలి” అని భువనేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. వన్ మిలియన్ వన్ బిలియన్ బృందం చేస్తున్న సేవలు దేశ భవిష్యత్తుకు దోహదం చేస్తాయని ఆమె అభినందించారు.