manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 4:10 pm Editor : Mana Praja Prathinidhi

చాయ్‌వాలా ప్రధాని అయ్యాడంటే కారణం రాజ్యాంగమే,సీఎం చంద్రబాబు

– రాజ్యాంగ సదస్సులో సీఎం ఘనమైన ప్రసంగం
– మోదీ నాయకత్వం, సీజేఐ గవాయ్ నిరాడంబరతపై ప్రశంసలు
– 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తి అవుతుందన్న ధీమా

విజయవాడ, 16 (మనప్రజాప్రతినిధి):

భారత ప్రజాస్వామ్య పునాది అయిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి అందించే అవకాశాలు అపారమని, చాయ్‌వాలా నుంచి దేశ ప్రధానమంత్రిగా ఎదగడం కూడా రాజ్యాంగ శక్తి వల్లనే సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం నిర్వహించిన ‘భారత రాజ్యాంగం – 75 సంవత్సరాలు’ సదస్సులో ప్రధాన అతిథిగా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పాల్గొనడం సదస్సుకు మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది. చంద్రబాబు మాట్లాడుతూ, రాజ్యాంగం అందించే సమాన అవకాశాల వల్లనే దేశవ్యాప్తంగా అనేక సామాన్య కుటుంబాలకు చెందిన వ్యక్తులు అత్యున్నత స్థానాలకు చేరుకుంటున్నారని గుర్తుచేశారు. “తన జీవితం ఒక చిన్న స్టాల్‌లో చాయ్ అమ్మకం నుంచి ప్రారంభమైనా, దేశం అతనికి ఇచ్చిన అవకాశాలను వినియోగించి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల్లో భారతదేశాన్ని ప్రతినిధ్యం వహిస్తున్న స్థాయికి మోదీ చేరడం ప్రజాస్వామ్య మహిమ” అని వివరించారు. రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ భావన వల్లే తనలాంటి ప్రజాప్రతినిధులు కూడా సేవ చేసే అవకాశం పొందారని చెప్పారు. సీజేఐ జస్టిస్ గవాయ్ వ్యక్తిత్వాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతం నుంచి అత్యున్నత న్యాయస్థాన శిఖర స్థానానికి ఎదిగినా, ఆయనలోని నిరాడంబరత ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. సమాన న్యాయం, సమానత్వం, సామాజిక న్యాయం అనే విలువలను గవాయ్ ఎల్లప్పుడూ ముందుకు తెస్తారని, ఆయన తీర్పులు ప్రజలందరికీ స్పూర్తిచిగురించేలా ఉంటాయని అన్నారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో ఏపీ హైకోర్టు మరింత సుస్థిరత సాధిస్తోందని కూడా అభిప్రాయపడ్డారు.భారత యువత శక్తిపై మాట్లాడుతూ చంద్రబాబు, ప్రపంచంలోని అనేక ప్రముఖ దేశాలు వృద్ధ జనాభా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ భారత్‌కు అపారమైన యువశక్తి ఉన్నదని చెప్పారు. దేశం చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజల ఆలోచనా ధోరణి విస్తృతమైందని, ఆ మార్పు భారత భవిష్యత్తుకు పునాది అని వ్యాఖ్యానించారు. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల సరసన నిలపడానికి ప్రతి రంగంలో మార్పులు, సంస్కరణలు తప్పనిసరి అని అన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపాడు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రసాదించిన సమాన ఓటు హక్కు భారత ప్రజాస్వామ్యపు అత్యంత గొప్ప బలం అని చంద్రబాబు గుర్తుచేశారు. “సమాన ఓటు హక్కు వల్లే ఈ దేశంలో సామాన్యుడు కూడా దేశ దిశను మార్చగలడు. పేద, ధనిక, స్త్రీ, పురుష—ఎవరైనా ఒకే ఓటుతో భవిష్యత్తును తీర్చిదిద్దగలరు. ఇది భారతదేశానికి ప్రత్యేకమైన లక్షణం” అని అన్నారు. సోషల్ మీడియా ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, తప్పుడు ప్రచారం, వ్యక్తిగత దాడులు పెరుగుతున్నాయి, ఇలాంటి సందర్భాల్లో ప్రజాస్వామ్యం, దేశ ప్రయోజనం మొదటి ప్రాధాన్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.