manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 9:20 am Posted by : Mana Praja Prathinidhi

బిలియనీర్ ఇంట పెళ్లి వేడుకల వైభవం..

మాధురీ నృత్యానికి మంత్రముగ్ధులైన అతిథులు

ఉదయ్‌పూర్‌,నవంబర్ 24,మనప్రజాప్రతినిధి:

ఓర్లాండోకు చెందిన బిలియనీర్‌, ఔషధ రంగంలో అగ్ర వ్యాపారవేత్తగా పేరుగాంచిన రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన సూపర్ ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు వంశీ గదిరాజు వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అంబానీ కుటుంబ వివాహాల తర్వాత దేశంలోనే అత్యంత ఖర్చుతో జరిగిన పెళ్లిగా ఈ కార్యక్రమం నిలిచిందని నిర్వహక వర్గాలు, అతిథులు చెబుతున్నారు.
ఉదయ్‌పూర్‌లో నవంబర్ 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు ఈ వివాహ ఉత్సవాలు నిర్వహించారు. దేశవిదేశాల నుంచి రాజకీయ, వ్యాపార, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. మొదటి రోజు వేడుకలకే హాలీవుడ్, బాలీవుడ్ తారలతో పాటు పలు అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొనడంతో ఈ పెళ్లి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నవంబర్ 22న జరిగిన మెహందీ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ వేడుకలో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ చేసిన నృత్య ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఆకుపచ్చ లెహంగా, గులాబీ రంగు దుపట్టాతో వేదికపైకి వచ్చిన ఆమె దేవదాస్ చిత్రంలోని ప్రఖ్యాత గీతానికి నృత్యం చేసి అతిథులను అలరించింది. ఈ ప్రదర్శనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి. మాధురీ ఇప్పటికీ అదే శక్తితో నాట్యం చేస్తోందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ వేడుకల్లో రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, కృతి సనన్, షాహిద్ కపూర్ వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. మెహందీ నైట్‌కు దియా మీర్జా ఆతిథ్యం ఇవ్వగా, నోరా ఫతేహి తన నృత్య ప్రదర్శనతో వేదికను ఉర్రూతలూగించింది. సంగీత్ నైట్‌కు కరణ్ జోహార్, సోఫీ చౌదరి యాంకరింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దేశవిదేశాల నుంచి వచ్చిన అతిథులతో మూడు రోజుల పాటు సాగిన ఈ వివాహోత్సవాలు నవంబర్ 23తో ముగిశాయి. అతిథుల జాబితా, సెలబ్రిటీల ప్రదర్శనలు, ఖర్చు స్థాయిల కారణంగా ఈ పెళ్లి 2024–25 కాలంలో అత్యంత చర్చనీయాంశమైన ఘట్టంగా నిలిచినట్లు సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.