manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 4:26 pm Editor : Mana Praja Prathinidhi

రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల గృహాల లక్ష్యం

ఆదిలాబాద్‌లో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం
పేదల గృహ కల నెరవేర్చాలని మంత్రి జూపల్లి స్పష్టం
ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు రుణ సాయంపై భరోసా

అదిలాబాద్, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):

అదిలాబాద్ జిల్లా అనుకుంట కాలనీ బంగారి గూడలో బాస గంగమ్మ–రమేష్ దంపతులు నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని మంత్రి అన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇళ్లు పూర్తి చేసుకోలేని లబ్ధిదారులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో రుణ సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్ల వ్యయంతో మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని జూపల్లి పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబం సురక్షితమైన గృహాన్ని పొందాలి అన్నదే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులపై ఆయన తీవ్రమైన విమర్శలు గుప్పించారు. తులం బంగారం, రూ.4 వేల పెన్షన్ అంటూ మాటల దండలు వేసే బీఆర్ఎస్ నాయకులు, తమ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల భారం కిందకి నెట్టేశారని ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి వంటి అంశాల్లో ప్రజలను మోసపెట్టిందీ గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి మండిపడ్డారు. “ప్రజలకు బాకీ పడ్డది ఎవరో చెప్పాలంటే అదే బీఆర్ఎస్ ప్రభుత్వం” అని జూపల్లి వ్యాఖ్యానించారు. జిల్లాలోని బీజేపీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కూడా జూపల్లి స్పందించారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం తీసుకురావడంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. బిహార్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లే తెలంగాణకు కూడా కేంద్రం నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేదల గృహ కలలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.