సదాశివపేట,డిసెంబర్29(మన ప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పటేల్ ఫ్యామిలీ దాబా సమీపంలో, ఎన్‌హెచ్–65పై వేగంగా వెళ్తున్న సుజుకి బర్కు మెన్ ఫ్యాషన్ బైక్‌ను మరో బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.ప్రమాదంలో పాల్గొన్న రెండు బైక్‌లు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో, బైక్‌లపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు బైక్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని రోడ్డుపై నుంచి తొలగించి, అంబులెన్స్ ద్వారా సమీపంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన వారి వివరాలు, వారి పరిస్థితిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.