మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబరు 01
ఇల్లంతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన సామాజిక ఉద్యమకారుడు, ఎమ్మార్పీఎస్ జిల్లా కో–కన్వీనర్ సావనపెల్లి రాకేష్ మాట్లాడుతూ—భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఈ నెల 6వ తేదీన స్మారక సభను దళిత–బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
డా. అంబేద్కర్ దళిత–బహుజన అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆ మహనీయుడి ఆశయాలను ప్రజల్లో మరింత విస్తరించేందుకు ఈ స్మారక సభ నిర్వహిస్తున్నామని రాకేష్ తెలిపారు. కార్యక్రమానికి జిల్లా మరియు రాష్ట్ర స్థాయి నాయకులు, మేధావులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
మండలంలోని అన్ని గ్రామాల నుండి మాజీ ప్రజా ప్రతినిధులు, మేధావులు, అంబేద్కరిస్టులు, విద్యార్థులు, యువజన నాయకులు, దళిత–బహుజన ప్రజా సంఘాల అధ్యక్షులు, సభ్యులు రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో యువజన సంఘాల జేఏసీ మండల కన్వీనర్ మామిడి విజయ్, బహుజన ఉద్యమకారుడు ఏనుగుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.