manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 December 2025, 5:19 pm Editor : Mana Praja Prathinidhi

శ్రీకాళహస్తిలో వాహనదారులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం

హెల్మెట్ లేకుండా పెట్రోల్ లేదు -డిసెంబర్ 15 నుంచి కఠిన చర్యలు
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి.డిసెంబర్13
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ద్విచక్ర వాహనదారుల ప్రాణ భద్రత పరిరక్షణ లక్ష్యంగా శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద వన్ టౌన్ సీఐ ఆధ్వర్యంలో అవగాహన చర్యలు నిర్వహించారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ విక్రయించరాదని స్పష్టం చేస్తూ పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేక అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.అలాగే హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు పెట్రోల్ పోయరాదని పెట్రోల్ బంకుల యజమానులు, నిర్వాహకులకు అధికారిక నోటీసులు జారీ చేశారు.డిసెంబర్ 15 నుంచి శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై మోటారు వాహన చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు, జరిమానాలు విధించనున్నట్లు హెచ్చరించారు.హెల్మెట్ లేకుండా వాహనం నడపడం చట్ట ఉల్లంఘన మాత్రమే కాకుండా ప్రాణాంతక నిర్లక్ష్య చర్య అని జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ప్రజల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి సడలింపులు ఉండవని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడుకోండి.ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ శాఖకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.