manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 2:04 am Posted by : Mana Praja Prathinidhi

ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి

కొండపాక మండలంలో విషాద ఘటన
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్14
కొండపాక మండలంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొండపాక గ్రామానికి చెందిన రాజేష్ (17)వడ్డెర కాలనీకి చెందిన యువకుడిగా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే…
రాజేష్ తన స్నేహితుడు నాగేంద్రతో కలిసి ద్విచక్ర వాహనంపై తిమ్మారెడ్డిపల్లి నుంచి కొండపాకకు వస్తున్న క్రమంలో ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదం శనివారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో చోటుచేసుకుంది.
ట్రాక్టర్‌ను బలంగా ఢీకొనడంతో రాజేష్ తలకు తీవ్ర గాయాలు కాగా, అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కుక్కునూరు పల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది..