మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లడిసెంబర్ 17
స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు బయలుదేరిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువు ఒడిలోకి చేరాడు. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన గుర్రం శరత్ రెడ్డి (20) మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.గ్రామస్తుల కథనం ప్రకారం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన శరత్ రెడ్డి సోమవారం తన మిత్రుడితో కలిసి పల్సర్ బైక్‌పై కరీంనగర్‌లో ఉన్న స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అల్గునూర్ ఈనాడు కార్యాలయం సమీపంలో ఎదురుగా వచ్చిన స్కూటీ బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదాన్ని తప్పించేందుకు బ్రేకులు వేయడంతో బైక్ అదుపు తప్పి పల్టీలు కొట్టి దూరంగా ఎగిరి పడింది. ఈ ఘటనలో శరత్ రెడ్డి తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం జరిగింది.తక్షణమే గాయపడిన శరత్‌ను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్‌కు తరలించగా, వైద్యులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేక మంగళవారం సాయంత్రం శరత్ రెడ్డి మృతి చెందాడు.మృతుడు గుర్రం లావణ్య-శ్రీనివాస్ రెడ్డి దంపతుల రెండవ కుమారుడు. పెద్ద కుమారుడు చందు రెడ్డి కాగా, చిన్న కుమారుడు శరత్ రెడ్డి. శరత్ రెడ్డి కరీంనగర్‌లోని స్థానిక డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.యువకుడి అకాల మృతితో రేపాక గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఆవేదనను చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.