manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 3:17 am Editor : Mana Praja Prathinidhi

పాలనా నిర్లక్ష్యానికి బలైన పసి ప్రాణం!సిరిసిల్లలో భద్రతా వైఫల్యం.. ప్రభుత్వంపై ప్రశ్నలు.

నిబంధనల ఉల్లంఘనపై ఎందుకు మౌనం?
ప్రజా భద్రత పక్కన పెట్టిన పాలనా యంత్రాంగం.•మున్సిపల్ నిర్లక్ష్యమే పసి ప్రాణం తీసిందా?
భద్రతా నిబంధనల అమలులో ప్రభుత్వ వైఫల్యం
అభివృద్ధి పేరుతో ప్రజల ప్రాణాలపై ఆటలు?
అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలెక్కడ.శోకసంద్రంలో తల్లి మామిడి లావణ్య.
మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్ 25
పట్టణ అభివృద్ధి పేరుతో జరుగుతున్న నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాల అమలులో ప్రభుత్వ వైఫల్యం మరో అమాయక ప్రాణాన్ని బలితీసుకుంది. సిరిసిల్ల పట్టణంలోని సర్దార్ నగర్‌లో చోటుచేసుకున్న ఘటన పాలనా నిర్లక్ష్యానికి ప్రతీకగా మారింది.
ఇంటి నిర్మాణానికి మున్సిపల్ అనుమతులు ఇచ్చే సమయంలో కనీస భద్రతా నిబంధనలను అమలు చేయాల్సిన అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన లోతైన సంపుపై మూత గానీ, రక్షణ కంచె గానీ లేకపోవడం స్పష్టమైన నిబంధనల ఉల్లంఘన అయినప్పటికీ, అధికారులు కళ్లు మూసుకున్నట్టు వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నిర్లక్ష్యానికి బలై శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న నికేష్ (6) అనే పసిబాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పాలకులు అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్నా, ప్రజల ప్రాణ భద్రతకు మాత్రం విలువ లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచే ప్రమాదకర పరిస్థితులపై స్థానికులు హెచ్చరిస్తున్నా, స్పందించని మున్సిపల్ యంత్రాంగం ఈ ఘటనకు ప్రత్యక్ష బాధ్యత వహించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ప్రజా భద్రతను పక్కన పెట్టి అనుమతులు జారీ చేయడం ద్వారా అధికారులు పాలనా బాధ్యతలను విస్మరించారని విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ ఘటనపై రాజకీయ నాయకులు స్పందించి, బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, బాధ్యులైన ఇంటి యజమాని తో పాటు విధుల్లో నిర్లక్ష్యం చేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రజా ఉద్యమాలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.పసి ప్రాణం పోయిన తర్వాతైనా పాలకులు, అధికారులు మేల్కొని భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు.