మనప్రజాప్రతినిధి//సిద్దిపేట నియోజకవర్గం.డిసెంబర్ 24.
మార్చ్‌లో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. “మీ పిల్లలు సిద్దిపేటలో ఫస్ట్ రావాలని నా తపన. అందులో ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించాలి” అని ఆయన ఉత్తరంలో పేర్కొన్నారు.
•హరీష్ రావు తల్లిదండ్రులకు ఇచ్చిన ముఖ్య సూచనలు:
వచ్చే మూడు నెలలు టీవీ, సెల్ ఫోన్‌లను దూరం ఉంచండి.
విందులు, వినోదాలు, ఫంక్షన్లు, సినిమాలు వద్దు.
ఇంటి పనులు లేదా వ్యవసాయ పనులకు పిల్లలను పంపరాదు.
“చదువు ఒకే వ్యసనం, ఇది జీవితంలో అత్యంత సత్ప్రయోజనకరమైన ‘ఔషధం’” అని ఆయన అన్నారు. ప్రణాళికాబద్ధమైన చదువు ప్రతి విద్యార్థి భవిష్యత్తును మార్చగలదని హరీష్ రావు గుర్తు చేశారు.
గత నాలుగు సంవత్సరాలుగా సిద్దిపేట నియోజకవర్గంలో పదో తరగతి విద్యార్థుల విజయాలను ప్రస్తావిస్తూ, నూటికి నూరు శాతం పాస్ అవుతున్నారని, బాసర ట్రిపుల్ ఐటీ సంస్థలో 169 మంది విద్యార్థులు సీట్లు పొందిన సంగతి ఆయన తెలిపారు.
విద్యార్థుల విజయం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు, అల్పాహారం, డిజిటల్ క్లాసులు, మోడల్ టాయిలెట్స్, డిజిటల్ కంటెంట్ పుస్తకాలు అందించడం జరుగుతున్నదని, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్టు హరీష్ రావు తెలిపారు.“మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. చదువుతోపాటు చేతిరాత కూడా చక్కగా ఉండేలా చూసుకోండి. నా వంతు ప్రయత్నం చేస్తున్నాను, మీరు కూడా మీ పిల్లలను బాగా చదివించండి” అని తల్లిదండ్రులకు ఆహ్వానించారు.