_మంత్రులను కలిసిన నూతన సర్పంచ్ లు
మనప్రజాప్రతినిధి//కొండపాక మండల్
నూతనంగా ఎన్నికైన సర్పంచుల అభినందన సభ సిద్దిపేట డిసిసి అధ్యక్షులు ఆంక్ష రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో సన్మాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ హాజరై సర్పంచులను ఘనంగా సన్మానించారు.కొండపాక మండల పరిధిలోని వెలికట్ట గ్రామ సర్పంచ్ బూరుగుల మానస సురేందర్రావు, జప్తి నాచారం గ్రామ సర్పంచ్ లక్కిరెడ్డి పావని శశిధర్ రెడ్డి మంత్రులను కలిసి తమ గ్రామాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఇన్చార్జి మంత్రి వివేక్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న సమస్యలపై నివేదికలు ఇస్తే ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ దిశగా పార్టీ గౌరవాన్ని కాపాడుతూ మీరు పని చేయాలి అని మంత్రులు పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజా పాలనలో గ్రామస్థాయి ప్రజాప్రతినిధులే ప్రభుత్వానికి బలమని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందన్నారు. గత ప్రభుత్వంలో సర్పంచులు పడ్డ ఇబ్బందులు ఇక ఉండవని, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, వంటి పథకాల అమలులో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.