manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 2:01 am Editor : Mana Praja Prathinidhi

దుబ్బాక రైతులపై భారం మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట భూంపల్లి మండలం.దుబ్బాకనియోజకవర్గం.సిద్దిపేట జిల్లా.డిసెంబర్30
దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలేనని, రైతుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించారు.
గత యాసంగితో పోలిస్తే ఈసారి రైతులు రెట్టింపు స్థాయిలో నాట్లు వేసినప్పటికీ, కనీస అవసరమైన యూరియా ఎరువు దొరుకుతుందో లేదో అనే భయం రైతుల్లో మొదలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. షాపుల్లో నేరుగా ఇవ్వాల్సిన యూరియాను యాప్ విధానం పేరుతో రైతులపై బలవంతంగా మోపడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.నాట్లు వేసే కీలక సమయంలోనే రైతులకు రోజుకు కేవలం 8–9 గంటల విద్యుత్ సరఫరా మాత్రమే అందుతోందని, రాబోయే వేసవి కాలంలో పరిస్థితి మరింతదారుణంగా మారుతుందని రైతులు భయపడుతున్నారని అన్నారు.కరెంట్ పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతులు అధికారుల చుట్టూ తిరిగితే “బడ్జెట్ లేదు” అంటూ మొహం మీదే చెప్పే దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని ప్రభుత్వంపై మండిపడ్డారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూడవెల్లి వాగు నుంచి ఏర్పాటు చేసిన టెంపరరీ కాలువల్లో పూడిక నిండిపోయిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి పూడికతీత పనులు చేపట్టి యాసంగి పంటలకు నీరందించకపోతే వేల ఎకరాల్లో పంట నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.సిద్ధిపేట జిల్లాలో మూడు ప్రధాన ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు సంవత్సరాలుగా ఒక్క రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించలేదని తీవ్ర విమర్శలు చేశారు.మల్లన్న సాగర్‌లో నీళ్లు నిండుగా ఉన్నా, కాలువల్లో పూడిక నిండిపోయి పొలాలకు చుక్క నీరు కూడా అందడం లేదని, దీనిపై మంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు కనీసం కాలువలు శుభ్రం చేసే స్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేకపోవడం బాధాకరమని అన్నారు.
అలాగే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల వద్ద దించుకునే పరిస్థితి లేకుండా చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మిల్లు యజమానులు ఇష్టానుసారంగా తరుగు పేరుతో ధాన్యంలో కోత విధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీలో తీవ్రంగా ధ్వజమెత్తారు.రైతుల పక్షాన పోరాటం ఆగదని, ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.