manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 5:56 am Posted by : Mana Praja Prathinidhi

తిరుపతి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ

మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్31
నూతన సంవత్సరం–2026 సందర్భంగా తిరుపతి జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ బాధ్యతాయుతంగా, శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు ఆంక్షలు మరియు కఠిన భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.డిసెంబర్ 31 రాత్రి మరియు జనవరి 1 తేదీల్లో జిల్లా అంతటా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్య పట్టణాలు, ప్రధాన రహదారులపై ప్రత్యేక పోలీస్ బృందాలతో విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా డ్రోన్ల ద్వారా నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.డీజేలు, లౌడ్‌స్పీకర్లు, శబ్ద కాలుష్యం, అశ్లీల నృత్యాలు పూర్తిగా నిషేధించబడి నట్లు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్, డాన్సులు, పార్టీలు, రంగులు పూయడం, టపాకాయలు కాల్చడం వంటి కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగం, బైక్ రేసింగ్, మైనర్లకు వాహనాలు ఇవ్వడం లేదా వారు నడపడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపర మైన చర్యలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తామని తెలిపారు.ప్రైవేట్ ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాలకు ముందస్తు పోలీస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. డిసెంబర్ 31 రాత్రి 9 గంటల నుంచి జనవరి 1 ఉదయం 4 గంటల వరకు తిరుపతి నగరంలోని గరుడ వారధిపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.నూతన సంవత్సరం ప్రతి కుటుంబా నికి ఆనందాన్ని తీసుకురావాలి కానీ విషాదానికి కారణం కాకూడదని ఎస్పీ తెలిపారు. యువత తొందరపాటు చర్యలకు దూరంగా ఉండి తమ విలువైన భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు.జిల్లా ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించి నూతన సంవత్సరం 2026ను శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకో వాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆకాంక్షించారు.