తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.నర్సిములు డిమాండ్
సదాశివపేట,డిసెంబర్18(మనప్రజాప్రతినిధి)
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, దానిని పథకంగా మార్చి కూలీల జీవనాధారాన్ని దెబ్బతీయవద్దని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లుకు నిరసనగా బుధవారం సదాశివపేట మండలం ఆత్మకూర్ చౌరస్తాలో ఆ బిల్లు ప్రతులను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. నర్సిములు మాట్లాడుతూ, ఉపాధి హామీని పని హక్కుగా కాకుండా కేవలం పథకంగా మార్చడం పేదలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి అని విమర్శించారు. పరిమిత నిధులతో అరకొరగా ఉపాధి కల్పించేందుకు కేంద్రం ప్రతిపాదించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) (విబిజి–ఆర్ఎఎంజి) అనే కొత్త పథకం సిగ్గుచేటని అన్నారు.ఇప్పటివరకు కూలీల డిమాండ్‌ను బట్టి పనులు కల్పించే విధానాన్ని రద్దు చేసి, స్థానిక అవసరం ఉంటేనే పనులు కేటాయించే విధానాన్ని అమలు చేయడం వల్ల కూలీలకు పని దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త బిల్లులో మహాత్మా గాంధీ పేరును తొలగించడం, నిధుల కోసం రాష్ట్రాలను మరింతగా కేంద్రంపై ఆధారపడేలా చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు.2005లో వామపక్షాల మద్దతుతో రూపొందించిన ఉపాధి హామీ చట్టం ద్వారా కోట్లాది కూలీలు జీవనోపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. ఇప్పటివరకు కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిధులతో కొనసాగుతున్న ఉపాధి పథకాన్ని కేంద్రం 60 శాతం నిధులకే పరిమితం చేయడం సరికాదన్నారు. నిరుద్యోగ భృతిని కూడా రాష్ట్రాలపై మోపడం అన్యాయమని విమర్శించారు.ఉపాధి హామీ పనుల ద్వారా రైతులకు రోడ్లు, చెరువులు, కుంటల మరమ్మత్తులు, ముళ్లపదుల తొలగింపు వంటి అనేక ప్రయోజనాలు కలిగాయని తెలిపారు. ఈ చట్టాన్ని బలహీనపరిస్తే పేదల ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వం తప్పక గురవుతుందని హెచ్చరించారు. ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఏసోబు, కుమారు, విజయరావు, కృష్ణ, దేవదాసు, రాములు తదితరులు పాల్గొన్నారు.