manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 6:10 am Editor : Mana Praja Prathinidhi

రెవెన్యూ శాఖ పేదల శత్రువుగా మారింది-బినామీ పట్టాల వెనుక అధికారుల మాఫియా

మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.డిసెంబర్21
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ పేదల శత్రువుగా మారిందని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వ భూములు పేదలకు చెందాల్సి ఉండగా, రెవెన్యూ అధికారుల సహకారంతో బినామీ పేర్లపై పట్టాలు జారీ చేసి భూదోపిడీ జరుగుతోందని మండిపడ్డారు.పేద రైతులు తరతరాలుగా సాగు చేస్తున్న భూములను లాక్కొని, స్థానికేతరులకు డీకేటి పట్టాలను మిల్ట్రీ పట్టాలుగా మార్చడం ద్వారా రెవెన్యూ అధికారులు భూదందాకు తెరలేపారని ఆరోపించారు. ఫ్యాక్టరీల ముసుగులో ప్రభుత్వ భూములను కబ్జా చేసి, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు వాటిని వాణిజ్య పంటల సాగుకు అద్దెకు ఇస్తూ కోట్లకు దండుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇనగలూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 433/1 లోని 2.55 ఎకరాలు, 433/2 లోని 2.30 ఎకరాల ప్రభుత్వ భూములు పూర్తిగా అక్రమ ఆక్రమణల చేతిలో ఉన్నాయని స్పష్టం చేశారు. గత 45 ఏళ్లుగా సాగులో ఉన్న పోలమ్మ – జయరామయ్య కుటుంబాన్ని భూమి నుంచి బలవంతంగా తప్పించి, రెవెన్యూ అధికారుల అండతో స్థానికేతరులకు పట్టాలు కేటాయించడం దుర్మార్గమని విమర్శించారు.జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినా, క్షేత్రస్థాయిలో అధికారులు కావాలని ఫైళ్లను దాచిపెట్టి న్యాయాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, పేదల హక్కులపై సాగుతున్న వ్యవస్థీకృత దాడి అని అన్నారు.
ఇప్పటికైనా ఆర్డిఓ స్పందించి అక్రమ పట్టాలను రద్దు చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోకపోతే, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన ఎర్రజెండాలు ఎగురవేసి భూస్వాధీన ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు.రెవెన్యూ శాఖ ఈ విధానాన్ని కొనసాగిస్తే, ప్రజల ఆగ్రహం ఉద్యమంగా మారి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని జనమాల గురవయ్య స్పష్టం చేశారు.