•కలియుగ కల్పవృక్షుడు శ్రీ పరశురామేశ్వర స్వామి
•భక్తులకు అపూర్వ ఫలితాలు అందించే నూతన వస్త్ర సేవ పూజ ప్రారంభం
మనప్రజాప్రతినిధి//ఎర్పేడుమండలం,డిసెంబర్24
శైవ సంప్రదాయంలో విశిష్టమైన పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఏర్పేడు మండలంలోని శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని నూతనంగా వస్త్ర సేవ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం భక్తుల్లో విశేష ఆదరణ పొందుతోంది.పురాణాల ప్రకారం ఆరుద్ర నక్షత్రం రోజునపరమశివుడు నటరాజ స్వరూపంలో ఆనంద తాండవం చేసిన దివ్య దినంగా శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ పవిత్ర నక్షత్రంలో శివారాధన చేయడం వల్ల జన్మజన్మాంతర పాపాలు నశించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, కుటుంబ శాంతి, సుఖసంతోషాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.
ఈ మహిమాన్విత ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభించిన వస్త్ర సేవ పూజలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొనవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సేవలో భాగంగా భక్తులు స్వామివారికి తొమ్మిది అడుగులు – ఐదు పట్టు పంచలు, ఆరు అడుగుల పూలమాల, పూజా సామాగ్రిని సమర్పించడంతో పాటు రూ.5,000/- రుసుమును దేవస్థానానికి చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.ఈ పూజ నిర్వహించిన భక్తులకు స్వామివారి ప్రసాదంగా స్వామివారి పట్టు శేష వస్త్రం, లడ్డూ, వడ, కొబ్బరికాయ అన్న ప్రసాదం, అలాగే స్వామివారి విభూది బ్యాగ్ అందజేయబడుతుందని తెలిపారు.ఆరుద్ర నక్షత్రం నాడు ఈ వస్త్ర సేవ పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి, దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, వృత్తి–వ్యాపార అభివృద్ధి, రుణ విమోచన, మనోశాంతి కలుగుతాయని పండితులు పేర్కొంటున్నారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు మాట్లాడుతూ, భక్తులందరూ పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి ఈ పవిత్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పత్రికా సోదరులు ఈ కార్యక్రమాన్ని తమ తమ పత్రికలలో ప్రచురించి దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.