manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 11:31 am Editor : MANA PRAJA PRATINIDHI

మహిళా అధికారుల గౌరవంపై దుష్ప్రచారం తగదు

మీడియాలో వచ్చిన కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం
వాస్తవాలతోనే వార్తలు రాయాలి
కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దు

హైదరాబాద్, జనవరి 10 (మనప్రజాప్రతినిధి):

మహిళా ఐఏఎస్ అధికారుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మీడియాలో వచ్చిన కథనాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా కథనాలు రాయడం సరికాదని హితవు పలికారు. నల్గొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కలెక్టర్ల బదిలీలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రక్రియ మంత్రులు, ఎమ్మెల్యేలకు ముందుగా తెలియకుండానే జరిగే సందర్భాలు ఉంటాయని చెప్పారు. అధికారులపై ఆధారంలేని ఆరోపణలు చేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు. సంచలనాల కోసం కాకుండా వాస్తవాల ఆధారంగా మాత్రమే వార్తలు రాయాలని మీడియాను కోరారు. చానళ్ల మధ్య పోటీ కోసం అధికారులను, ముఖ్యంగా మహిళా అధికారులను ఇబ్బంది పెట్టడం తగదని ఆయన అన్నారు. కేవలం మంత్రులపైనే కాకుండా ముఖ్యమంత్రిపై కూడా దుష్ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నిజాలు తెలియజేయడమే మీడియా బాధ్యత అని, గౌరవం, బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు.