manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 2:16 pm Editor : Mana Praja Prathinidhi

అసైన్డ్ భూమి ఆన్లైన్ పేరుతో భారీ మోసం

•నకిలీ సుంకరిని అరెస్ట్ చేసిన తంగళ్ళపల్లి పోలీసులు
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి22
అసైన్డ్ భూమిని ఆన్లైన్ చేయిస్తానని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన నకిలీ సుంకరిని తంగళ్ళపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తంగళ్ళపల్లి ఎస్‌ఐ మీడియాకు వెల్లడించారు.తంగళ్ళపల్లి మండలం గోపాల్‌రావుపల్లి గ్రామానికి చెందిన పురుషాని నాగరాజు (తండ్రి: రాజయ్య) తాను తంగళ్ళపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో సుంకరిగా పనిచేస్తున్నానని నమ్మబలికాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నడిగట్ల శ్రీనివాస్‌కు ఉన్న అసైన్డ్ భూమిని ఆన్లైన్ చేస్తానని మాయమాటలు చెప్పి, 2022లో అతని నుంచి రూ.3 లక్షల 72 వేల నగదును వసూలు చేశాడు.డబ్బులు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి పని చేయకపోగా, బాధితుడు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా, డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే కులం పేరుతో తప్పుడు కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు.దీంతో బాధితుడు తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడు పురుషాని నాగరాజును అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.ఇక నిందితుడి చేతిలో మరెవరైనా మోసపోయి ఉంటే, వెంటనే తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఎస్‌ఐ ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.