•23వ వార్డులో కాంగ్రెస్ బాకీ కార్డులతో ప్రజాగర్జన
•పేదల్ని మోసం చేసిన రేవంత్ సర్కార్‌కు బుద్ధి చెప్పాలి-ఎగమామిడి గణేష్
సదాశివపేట,జనవరి21(మనప్రజాప్రతినిధి):
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమం అగ్రస్థానంలో ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల జీవితం అస్తవ్యస్తమైందని బీఆర్‌ఎస్ నాయకుడు ఎగమామిడి గణేష్ మండిపడ్డారు. సదాశివపేట పట్టణంలోని 23వ వార్డులో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత ప్రచారంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేస్తూ, ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టిన ఆరు గ్యారంటీల వాస్తవ స్వరూపాన్ని ప్రజలకు వివరించారు. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు రుణమాఫీ వంటి పథకాలను పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల్ని నట్టేట ముంచిందని ఆరోపించారు.ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి పచ్చి మోసాలకు తెరలేపారని, వృద్ధులకు ఇప్పటికీ పెన్షన్లు ఇవ్వని దుర్మార్గ పాలన కొనసాగుతోందన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థులకు స్కూటీలు, తులం బంగారం, రెండు లక్షల ఉద్యోగాలు వంటి హామీలు గాలిలో కలిసిపోయాయని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు లేవు, విద్యాభరోసా లేదు – ఇదే కాంగ్రెస్ పాలన ఫలితమని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకపై ప్రతి ఇంటికి కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం వస్తే ప్రశ్నలతో నిలదీయాలని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడగాలని గణేష్ ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.