manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 01 January 2026, 2:44 am Posted by : Mana Praja Prathinidhi

అద్దె ఇంటి వెనక గంజాయి సాగు… 140 గ్రాముల గంజాయి మొక్కలు స్వాధీనం

నిందితుడి అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు
మనప్రజాప్రతినిధి//కొండపాక-కుకునూరుపల్లిమండలం
కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలో అద్దె ఇంటి వెనుక భాగంలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో సుమారు 140 గ్రాముల గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అంతర్ రాష్ట్రానికి చెందిన ఎస్.కే. రాకిబుల్ అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాలుగా లకుడారం గ్రామంలో అద్దెకు నివసిస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. పని సక్రమంగా దొరకక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆరు నెలల క్రితం తాను అద్దెకు ఉంటున్న ఇంటి వెనుక భాగంలో గంజాయి విత్తనాలను నాటి సాగు చేశాడు.పెరిగిన గంజాయి మొక్కల నుంచి ఆకులను తెంపి ఎండబెట్టి, పొడి చేసి రహస్యంగా వినియోగిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇటీవల పది రోజులుగా సింగాటం గ్రామంలో పని ఉండటంతో అక్కడే ఉండగా, రెండు రోజులకు ఒకసారి లకుడారానికి వచ్చి మొక్కలకు నీళ్లు పోసి వెళ్లేవాడని పోలీసులు తెలిపారు.నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడి ఇంటిపై దాడి చేసి, అక్కడ సాగు చేసిన గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లకుడారం బస్టాండ్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపినట్లు తొగుట సీఐ లతీఫ్ వెల్లడించారు.