manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 2:01 pm Posted by : Mana Praja Prathinidhi

గ్యాస్‌ సిలిండర్‌ ఉన్న ప్రతి ఇంటికి రూ.6 లక్షల బీమా ఉందని తెలుసా?

హైదరాబాద్, 04-01-2026(మనప్రజాప్రతి నిధి):

ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. ముఖ్యంగా వంట గ్యాస్‌ సిలిండర్‌ కారణంగా అగ్నిప్రమాదాలు జరిగితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి ప్రమాదాల సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు లక్షల రూపాయల విలువైన బీమా రక్షణ ఉచితంగా అందుబాటులో ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. ఈ అవగాహన లేకపోవడంతో చాలా కుటుంబాలు తమకు రావాల్సిన పరిహారాన్ని కోల్పోతున్నాయి.
గ్యాస్‌ కంపెనీల వద్ద నమోదు చేసుకున్న ప్రతి వినియోగదారుడికి ఈ బీమా వర్తిస్తుంది. గ్యాస్‌ లీక్‌ లేదా సిలిండర్‌ కారణంగా నేరుగా అగ్నిప్రమాదం జరిగితే ఈ రక్షణ అమలులోకి వస్తుంది. ఇతర కారణాలతో మంటలు చెలరేగి తరువాత సిలిండర్‌ పేలితే మాత్రం ఇది వర్తించదు. ఈ బీమా కింద మరణం సంభవిస్తే ఒక్కొక్కరికి రూ.6 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. గాయాలు అయ్యి వైద్య చికిత్స అవసరమైతే ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు వైద్య ఖర్చుల కవరేజ్ ఉంటుంది. అదే ప్రమాదంలో ఇంటి ఆస్తి నష్టం జరిగితే వినియోగదారు నమోదు చేసుకున్న చిరునామాకు సంబంధించి రూ.2 లక్షల వరకు పరిహారం చెల్లిస్తారు. ఈ మొత్తం బీమా కోసం వినియోగదారుడు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియాన్ని గ్యాస్‌ కంపెనీలే భరిస్తాయి.
ప్రమాదం జరిగిన వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత మీ గ్యాస్‌ పంపిణీదారునికి రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలి. కంపెనీ అధికారులు సంఘటనపై విచారణ చేపడతారు. గ్యాస్‌ సిలిండర్‌ లేదా దాని అమరిక కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్ధారణ అయితే బీమా సంస్థకు సమాచారం పంపిస్తారు. పరిహారం పొందేందుకు పోలీస్‌ ఫిర్యాదు ప్రతీ, వైద్య బిల్లులు, డాక్టర్‌ సూచనలు, ఆసుపత్రి విడుదల పత్రాలు అవసరం. మరణం జరిగితే మరణ ధృవీకరణ పత్రం, శవపరీక్ష నివేదిక కూడా సమర్పించాలి. ఆస్తి నష్టం జరిగితే దానికి సంబంధించిన చిత్రాలు ఇవ్వాలి. అవసరమైన అన్ని పత్రాలు పూర్తి చేసిన తర్వాత నిబంధనల ప్రకారం పరిహారం నేరుగా బాధితులకు అందజేస్తారు.