– కేటీఆర్ సమక్షంలో సర్పంచ్ చేరిక
– కొల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయ చర్చ
హైదరాబాద్, జనవరి 8 (మనప్రజాప్రతినిధి):
కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండల కేంద్రం నుంచి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ దివ్యశ్రీ రంజిత్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకొని అధికారికంగా పార్టీలో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.
అలాగే మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు అభిలాష్, ఇంతియాజ్, కుర్వ విజయ్, ఆంజనేయ గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి, వాల్యనాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకుల పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో ఈ చేరిక కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నాయకత్వం బలపడితేనే పార్టీ మరింత బలోపేతమవుతుందని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాడే నాయకులకు బీఆర్ఎస్ పార్టీలో ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. దివ్యశ్రీ రంజిత్ పార్టీలో చేరడం ద్వారా కొల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ బలం మరింత పెరుగుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.