manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 11:53 am Editor : Mana Praja Prathinidhi

ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయవద్దు

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను నీరుగార్చే జి-రామ్‌జీ పథకాన్ని వెంటనే ఉపసంహరించాలి
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.జనవరి19
ఏఐసీసీ, పిసిసి పిలుపు మేరకు తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు అధ్యక్షతన, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మండలం వేడాం గ్రామం వద్ద ఉపాధి హామీ కార్మికులతో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జి-రామ్‌జీ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆరోపించారు. ఈ పథకం అమలైతే కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని ఆయన అన్నారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ పేరు పథకం నుంచి తొలగించడం యావత్ భారతదేశాన్ని అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు. గ్రామాల్లో పేదరిక నిర్మూలన, వలసల నివారణ కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని నేడు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాల ద్వారా బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఇప్పటికే లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై జి-రామ్‌జీ పథకం ద్వారా సుమారు 40 శాతం ఆర్థిక భారం పడుతుందని ఆయన హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, మండల యువజన అధ్యక్షులు నవీన్, అలాగే నాగరాజు, మహేష్, అరుణ్, అల్లావుద్దీన్, నరేష్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.