•సమగ్రఅభివృద్ధికి నిదర్శనంగారోడ్లు,డ్రెయిన్లు,లైటింగ్ పనులు
మాజీకౌన్సిలర్ పట్లూరినాగరాజుగౌడ్
సదాశివపేట,జనవరి16(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట పట్టణంలోని 19వ వార్డు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం గణనీయమైన నిధులు కేటాయించిందని వార్డు మాజీ కౌన్సిలర్ పట్లూరి నాగరాజు గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలంలోనే టీయూఎఫ్ఐడీసీ నిధుల కింద మొత్తం రూ.1.70 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు కావడం విశేషమని అన్నారు.
ఈ నిధులు మంజూరు చేసినందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి, టీజీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి గారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా పట్లూరి నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి నిధులు సాధ్యమయ్యాయంటే అది ప్రజాప్రతినిధులపై ప్రజలకు ఉన్న నమ్మకానికి, ప్రభుత్వ అభివృద్ధి దృక్పథానికి నిదర్శనమనిపేర్కొన్నారు.
రూ.1.70 కోట్ల నిధుల్లో రూ.75 లక్షలను శాస్త్రి రోడ్ అభివృద్ధికి, రూ.20 లక్షలను సాయిరాం షాపింగ్ మాల్ రోడ్ నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు. అలాగే జాతీయ రహదారిలో సీసీ డ్రెయిన్ నిర్మాణానికి రూ.20 లక్షలు, సుభాష్ రోడ్డులో సీసీ రోడ్‌తో పాటు లైటింగ్ ఏర్పాట్లకు రూ.50 లక్షలు వినియోగిస్తున్నామని వివరించారు. మిగిలిన నిధులతో వార్డులో అవసరమైన మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ స్థాయిలో అభివృద్ధి సాధ్యమైందని, సదాశివపేట పట్టణ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి ప్రయాణానికి మరింత బలం చేకూర్చాలని పట్టణ, వార్డు ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.