manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 9:29 am Posted by : Mana Praja Prathinidhi

చదువు ఖరీదైంది భవిష్యత్ బానిసయ్యింది?

– విద్యా వ్యయం ఆకాశమే హద్దా?
– అప్పుల్లో మొదలయ్యే యువత జీవితం
– ప్రభుత్వ విద్య ఎందుకు బలహీనమైంది?

జనవరి 6 (మనప్రజాప్రతినిధి):

ఒకప్పుడు చదువు అంటే జీవితానికి వెలుగునిచ్చే మార్గంగా భావించేవారు. నేటి పరిస్థితుల్లో అదే చదువు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది. స్కూల్ నుంచి డిగ్రీ వరకూ ఫీజులు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను సేవగా కాకుండా లాభాల వ్యాపారంగా మార్చేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

– అప్పుల్లో మొదలయ్యే యువత జీవితం

డిగ్రీ పూర్తయ్యేలోపే యువత భుజాలపై అప్పుల భారం పడుతోంది. విద్యా రుణాలు భవిష్యత్తుకు బాట వేయాల్సిన యువతను ముందే ఆర్థిక బానిసలుగా మారుస్తున్నాయన్న వాదన బలపడుతోంది. చదువు పూర్తయినా ఉద్యోగం దొరకని పరిస్థితిలో ఆ అప్పులే శాపంగా మారుతున్నాయి. ఉద్యోగం దొరికినా జీతంలో పెద్ద భాగం లోన్ వాయిదాలకే వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంటోంది.

– ప్రభుత్వ విద్య ఎందుకు బలహీనమైంది?

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోవడం మరో కీలక అంశంగా మారింది. మౌలిక సదుపాయాల కొరత, ఉపాధ్యాయుల కొరువు, బోధన నాణ్యతపై సందేహాలతో తల్లిదండ్రులు ప్రైవేట్ విద్య వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉచిత విద్య అన్న భావన పత్రాలకే పరిమితమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యపై ప్రభుత్వ వ్యయం సరిపడా లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

– చదువు లక్ష్యమా? లాభమా?

విద్య లక్ష్యం జ్ఞానం, ఉపాధి, సామాజిక ఎదుగుదల కావాలి. కానీ నేటి వ్యవస్థలో లాభాలే కేంద్రంగా మారాయన్న భావన బలంగా ఉంది. చదువు ఖరీదైతే భవిష్యత్తు సంపన్నులకే పరిమితమవుతుందా? సామాన్య కుటుంబాల పిల్లలకు అవకాశాలు తగ్గిపోతాయా? అనే ప్రశ్నలు సమాజాన్ని వేధిస్తున్నాయి. విద్యను నిజంగా ప్రజల హక్కుగా మార్చాలంటే ప్రభుత్వాలు స్పష్టమైన విధానాలు, పెట్టుబడులతో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది.