manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 11:03 am Posted by : Mana Praja Prathinidhi

పెదకాకానిలో 14 మంది గంజాయి ముఠా అరెస్ట్

గుంటూరు జనవరి 4 (మనప్రజాప్రతినిధి )

గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులతో పాటు వినియోగిస్తున్న 10 మందిని పెదకాకాని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. నిందితుల నుండి 86 వేల విలువైన4.95కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పెదకాకాని గ్రామంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పాడుబడిన రేకుల షెడ్ఢులో గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బంది దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ముత్యాల రమణారావు అరకు ప్రాంతం నుండి గంజాయి తీసుకొచ్చి పెదకాకానిలో విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామని, అతని పై 4 గంజాయి, డెకాయిట్, ఒక చోరీ కేసు నమోదైందని చెప్పారు. గంజాయి, అసాంఘిక శక్తుల రహిత జిల్లాగా గుంటూరును తీర్చిదిద్దడం కోసం 12 ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పారు. గంజాయి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.