manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 2:39 pm Editor : Mana Praja Prathinidhi

ఇళ్ల నిర్మాణదారులే టార్గెట్ – ఇటుకలు, ఇసుక పేరుతో దోపిడీ

•ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు…ఇద్దరు నిందితుల అరెస్ట్
మనప్రజాప్రతినిధి//వేములవాడ.జనవరి22
కొత్తగా ఇళ్లు నిర్మించుకునే అమాయక ప్రజలే లక్ష్యంగా తక్కువ ధరకే ఇటుకలు, ఇసుక, బేస్మెంట్ రాళ్లు సరఫరా చేస్తామని నమ్మించి నగదు దోచుకున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వరుస మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి అక్రమ దందాకు చెక్ పెట్టారు.కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి సదయ్య (60), ముద్దికుంట గ్రామానికి చెందిన గాదాసు రాజయ్య (50) ముఠాగా ఏర్పడి చుట్టుపక్కల మండలాల్లో తిరుగుతూ, కొత్త ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించేవారు. మేస్త్రీల ద్వారా ఇంటి యజమానుల వివరాలు సేకరించి, తమకు ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయని నమ్మబలికి ముందస్తుగా నగదు వసూలు చేసి పరారయ్యేవారు.ఈ విధంగా కొనరావుపేట, చందుర్తి, కథలాపూర్ మండలాల్లో పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. చందుర్తి సీఐ జి. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో, కొనరావుపేట ఎస్‌ఐ కె. ప్రశాంత్ రెడ్డి బృందం నిజామాబాద్ కమాన్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుంది.నిందితుల వద్ద నుంచిరూ.14,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదయ్యాయి.పోలీసుల స్టెర్న్ వార్నింగ్.తెలియని వ్యక్తులు తక్కువ ధరకే నిర్మాణ సామాగ్రి ఇస్తామని చెప్పి డబ్బులు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వేములవాడ ఏఎస్పీ కె. రుత్విక్ సాయి (IPS) ప్రజలను హెచ్చరించారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు.