బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బోరేం రాజేశ్వర్ హెచ్చరిక
సిద్దిపేటజిల్లా,అక్బర్‌పేట్–భూంపల్లిమండలం.జనవరి11
జిల్లాలను కుదిస్తామన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బోరేం రాజేశ్వర్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జిల్లాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు వస్తాయన్న పొంగులేటి వ్యాఖ్యలు పూర్తిగా సరికాదని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆర్టికల్–3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన సౌలభ్యం కోసం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జిల్లాలు, డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేశారని చెప్పారు.
2016సంవత్సరం నుంచి నేటి వరకు ఆ వ్యవస్థ ద్వారా పరిపాలన సజావుగా కొనసాగుతుందని, ఇప్పుడు జిల్లాలను కుదిస్తామని చెప్పడం అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. ఒకవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలను కరీంనగర్‌లో కలుపుతామని గతంలో చెప్పారని, మరోవైపు అసెంబ్లీలో సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పిన పొంగులేటి వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేయాలన్న మాటలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం ఉంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు రావాలే తప్ప, ఇలాంటి ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేయకూడదని హితవు పలికారు.సిద్దిపేట జిల్లాను తొలగిస్తా మన్న ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. లేనిపక్షంలో జిల్లా ప్రజలందరినీ కలుపుకొని, పార్టీలకు అతీతంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడ తామని హెచ్చరించారు.ముఖ్యమంత్రి గారికి మంత్రులకు మధ్య సమన్వయం లేక ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయా? లేక ముఖ్య మంత్రి గారి పేరిట మంత్రులు మాట్లాడుతున్నారా? అనే సందేహాలు ప్రజల్లో నెలకొంటున్నాయని తెలిపారు. ప్రజాగ్రహానికి గురికాకముందే, ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కొనే పరిస్థితి రాకముందే, మంత్రి పొంగులేటి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బోరేం రాజేశ్వర్ డిమాండ్ చేశారు.