manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 3:07 pm Posted by : Mana Praja Prathinidhi

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం:జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్..

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా యంత్రాంగం

శ్రీకాళహస్తి నియోజకవర్గం, జనవరి 22 (మన ప్రజా ప్రతినిధి):
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు–2026ను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తూ సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై గురువారం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు సజావుగా దర్శనం కల్పించేలా శాంతి భద్రతలు, వాహనాల పార్కింగ్, తాగునీరు, శానిటేషన్, అన్నప్రసాదాల పంపిణీ, వైద్య శిబిరాల ఏర్పాటు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు అనుమతించబోమని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు జరగకుండా ఐసిడిఎస్‌, పోలీస్ శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని, సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా ద్వారా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని తెలిపారు.
ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.